మనము
ఏ అమ్మవారి ఆరాధన చేసినప్పటికీ తప్పకుండా చేసేటటువంటిది బాలపూజ. సువాసిని
పూజ. ముఖ్యంగా ఈ శరన్నవరాత్రులలో బాలపూజకు మరియు సువాసిని పూజకు విశిష్టమైన
ప్రాముఖ్యత ఉంది.
మనకి
శాస్త్రంలో ఏ విషయం ఆచారంగా పెట్టినప్పటికీ దానికి ఒక కారణం ఉంటుంది. దాని
నుండి మనము నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. నిజానికి
చూడండి....మనము బాలపూజ చెయ్యడానికి కారణం తెలుసుకుంటే మనకే ఆశ్చర్యం
కలుగుతుంది. అనగా, దానిలో దాగుకుని ఉన్న తత్వాన్ని గ్రహించాలి. నిజానికి ఏ
ఇంట నడయాడుతున్న ఆడపిల్ల అయినా ఆ తల్లి స్వరూపముగానే భావన చెయ్యాలి.
నిజానికి ఈ నవరాత్రులలో సాక్షాత్తు ఆ జగన్మాతగానే భావించాలి. ఆ తల్లి
"భావనామాత్ర సంతుష్ట హృదయాయైనమః" కదా! మనం మనసులో భావించినంత మాత్రాన ఆ
తల్లి మనకు లొంగిపోతుంది.
పిల్లలను
చూడండి....వారికి ఎపుడూ ఆనందమే....మనసులో ఎటువంటి ఆందోళన లేకుండా
నిష్కల్మషంగా ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ ఉంటారు. మనము వారిని ఏ కారణం చేత
తిట్టినా, కొట్టినా లేక వాళ్ళ చేతిలో ఆడుకుంటున్న వస్తువుని లాగివేసినా
పిల్లలకి కోపం ఆ కాస్సేపే ఉంటుంది. కొంత తడవు ఏడ్చి వెంటనే మానేస్తారు.
కాస్సేపటికి మర్చిపోయి తిరిగి ఆడుకుంటారు. మనల్ని కూడా అంతే ప్రేమగా చూసి
నవ్వుతారు. వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటూ రాగ, ధ్వేషాలకు అతీతంగా ఉంటారు.
అందుకనే మనము కూడా రాగ ధ్వేషాలను విడనాడి చంటి పిల్లలలాగా ఆనందంగా ఉండాలి.
అది తెలియచేస్తూ వారి నడవడికను నేర్చుకోవాలని మనము బాలపూజ చేస్తాము. కాని,
మనము అందులో ఉన్న మర్మాన్ని గమనించకుండా పుణ్యం సంపాదించడం కోసం (అమ్మవారి
కృప పొందటం మంచిదే) ఈ పూజ చేస్తున్నాము. కాని, మన నడవడికలో మార్పు
తెచ్చుకునే ప్రయత్నము చెయ్యడంలేదు.
ఇక
మరి సువాసినీ పూజ విషయానికి వస్తే అమ్మవారు "సువాసిని సువాసిన్యర్చన
ప్రీతా". మరి ఆ తల్లి పెద్ద ముతైదువ. మొదటి ముతైదువ కాబట్టి మనందరం కూడా
దీర్ఘసుమంగళిగా ఉండాలని కోరుకుంటూ ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఆ తల్లి యొక్క
రూపంగానే భావించి సువాసిని పూజ చేస్తాము. నిజానికి సువాసినీ పూజ అనగానే
మనకి శ్రావణ శుక్రవారపు కధలో ఉన్న చారుమతి గుర్తుకు రావాలి. ఎంతోమంది
ముత్తయిదువులు ఉన్నప్పటికీ ఆ వరలక్ష్మీదేవి చారుమతినే వరించి స్వప్నంలో
సాక్షాత్కరించడానికి కారణం ఏమిటో తెలుసుకుంటే మనకి సువాసినీ లక్షణాలు గోచరం
అవుతాయి. మన శాస్త్ర ప్రకారం సువాసినీ లక్షణాలు కొన్నింటిని పరిశీలిద్దాము
(ఇవి నేను చెప్పేవి కాదు...శాస్త్రం నిర్ధారించినటువంటివి).
1) ఎప్పుడూ కూడా పెదవులపై చిరుమందహాసము చెరగనివ్వనివారు.
2) మృదు స్వభావము కలవారు
3) ఇతరులను తమ మాటలతో కష్టపెట్టనివారు
4) స్త్రీలకు పెట్టని ఆభరణాలుగా ఉండేవి....ఓర్పు మరియు చిరునవ్వు. ఈ రెండు సహజసిద్ధంగా వారి నడవడికతో అలవర్చుకున్నవారు.
5) భర్తను అనుగమించేవారు (ఎడ్డెమ్ అంటే తెడ్డెమ్ అనకుండా)
6) అత్తమామలను, ఆడపడుచులను, మరుదులను, బావగార్లను తగిన విధంగా గౌరవించేవారు
7) అత్తమామలను తమ తల్లిదండ్రులుగా భావించి, ప్రేమించి ఆదరించేవారు
8) గురువులయందు భక్తి కలవారు. ఎప్పుడైతే గురువులయందు భక్తి కలిగి ఉంటామో మనకి వినయం దానంతట అదే వస్తుంది. 'విద్యా దదాతు వినయం'
9)
మన పురాణ, ఇతిహాసాలయందు మక్కువ కలవారు. వాటిని చదవడమే కాదు....వారి
జీవితానికి కూడా అన్వయించుకోవాలి. పిల్లలకు గోరుముద్దలు తినిపించేటప్పుడు
చిన్న చిన్న కధలు చెపుతూ అన్నం పెడితే భావితరాలు కూడా గొప్పవిగా
తయారవుతాయి.
10)
అత్తింటివైపు బంధువుల మెప్పు సంపాదించిన వారు నిజానికి పుట్టింటివారు, మన
అమ్మాయి పెంకిది, మొండిది అయ్యి వంట రాకపోయినా....మన అమ్మాయి అని ఆ అమ్మాయి
చేసిన ప్రతి పనిని మెచ్చుకోవచ్చు. కాని, అత్తింటివారివైపు నుంచి మెప్పు
సంపాదించడం అంటే అది ఒక తపస్సే అని చెప్పవచ్చు. తొందరగా ఇంటికి వచ్చిన
కోడలిని మెచ్చుకోవడం అత్తింటివైపువారు అంటే....ఆ అమ్మాయి అందరిలో అంత బాగా
కలిసిపోయి తలలో నాలుకలా ఉండగలిగితేనే కదా! నిజానికి ఇది చాలా కష్టం. అలాంటి
మెప్పు సాధించాలి.
12)
మన సనాతన ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దానిని పాటించాలి కూడా. ఆ!!
ఎప్పుడు లేస్తే ఏముందిలే? అని, ఇంటి ఇల్లాలు కూడా బారెడు పొద్దెక్కాక
లేస్తే ఆ కాపురాలు అలాగే ఉంటాయి. వారి అభ్యున్నతి కూడా అలాగా ఉంటుంది.
13) సంతానాన్ని అభివృద్ధి చెయ్యడం యందు ఆసక్తి కలిగినదై ఉండాలి.
మరి
మనం ఇప్పటికి చెప్పుకున్నవి కొన్ని మంచి లక్షణాలే. మరి ఇవన్నీ ఉన్న
స్త్రీకి మనం సువాసిని పూజ చెయ్యాలి. కాని, నేటి కాలమాన పరిస్థితులలో ఈ
కొన్ని లక్షణాలలో ఏవో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే సువాసిని మొదటి
లక్షణం అయిన బొట్టు కూడా పెట్టుకుని, పెట్టుకోనట్లు చాలా చిన్నగా
పెట్టుకునే రోజులు. చేతులకి గాజులు ఉండవు. పిల్లలకి సరేసరి.
మన
నడవడికను సరి చేసుకుంటూ సంవత్సరానికి ఒక్కొక్క లక్షణాన్ని అయినా
నేర్చుకుంటూ పరిపూర్ణ సువాసినిగా మారాలి అనే....సువాసిని పూజ చేస్తాము. ఆ
పరిపూర్ణత పొందాలంటే మనకి సువాసిని లక్షణాలు తెలియాలి కదా!!
కాబట్టి
ప్రతి పండుగకు (అమ్మవారికి సంబంధించిన పండుగలకు) ఇలా సువాసిని పూజ, బాలపూజ
చేసి ఆ తల్లి కృపకు పాత్రులం అవడమే కాకుండా మన ప్రవర్తనలో కూడా మార్పు
తెచ్చుకునే అవకాశం ఆ తల్లి కల్పించాలని కోరుకుందాము.
"అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే"
సర్వేజనా సుఖినోభవంతు

No comments:
Post a Comment