Friday, 2 December 2016

కపిల గోవు విశిష్ఠత

ధర్మరాజు " పితామహా ! కపిలగోవు విశిష్ఠత తెలపండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము దేవతలకు ఆకలి వేసింది. వారంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు వారికి అమృతం ఇచ్చాడు. దేవతలు ఆ అమృతము సేవించారు. ఆ అమృతపు సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది.



 కామధేనువు నుండి మరి కొన్ని ఆవులు జన్మించాయి. ఆ ఆవులన్ని హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లిదగ్గర పాలు తాగుతుంది. ఆ పాల నురగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరచి ఆ ఆవులను చూసాడు. ఆ ఆవులన్ని ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి. ఆవులన్ని బెదిరి తలోదిక్కుకు పారి పోయాయి.




 ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి " మహేశా ! నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా ! లేగ దూడల నోటి నుండి వచ్చే నురగ కూడా అమృత సమానము కదా ! అది ఎంగిలి ఎలా ఔతుంది ! గోవు పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా ! దీనికి ఆగ్రహిస్తే ఎలా ! వాటిని కరుణించు " అని వేడుకుని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు.






 పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని ఆవులను ఆప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే బెదిరి పోయిన ఆవులు తిరిగి వచ్చాయి. శివుడు " బ్రహ్మదేవా ! ఈ గోవులన్ని నా మూడవ కంటిచూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్ఠమై నవిగా భావించబడతాయి " అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి కపిలగోవులనబడే ఎర్రటి గోవులు దానం ఇవ్వడం ఆనవాయితి అయింది " అని భీష్ముడు చెప్పాడు.

No comments:

Post a Comment